క్రమం తప్పకుండా అక్రోట్లను తినడం వల్ల హృద్రోగాలతోబాటు బీపీ కూడా తగ్గినట్లు పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే వాల్‌నట్స్‌లోని ఒమేగా-3- ప్యాటీ ఆమ్లాలు బీపీని తగ్గిస్తాయి. ఇందుకోసం వీళ్లు బీపీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతోన్న 30-65 వయసు మధ్యలోని 45 మందిని ఎంపిక చేసి, మూడు వర్గాలుగా విభజించారు. అందులో ఒక వర్గానికి వాల్‌నట్స్‌తో కూడిన డైట్‌నీ మరో వర్గానికి వాటికి బదులుగా అంతేపాళ్లలో ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్నీ, మూడోవర్గానికి వాల్‌నట్స్‌లో ఉండే ఫ్యాటీ ఆమ్లాల్లో సగం శాతాన్ని ఇతరత్రా ఆహారపదార్థాల నుంచి అందేలా చూశారట.

రెండు వారాల తరవాత వాళ్ల గుండె ఆరోగ్యాన్ని పరిశీలించగా- అందరిలోనూ పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. అయితే మిగిలిన రెండు వర్గాలతో పోలిస్తే నేరుగా వాల్‌నట్స్‌ తీసుకున్నవాళ్లలో బీపీ తగ్గడంతోబాటు గుండె పనితీరు కూడా బాగున్నట్లు గుర్తించారు. బహుశా అందులోని పీచూ బయోయాక్టివ్‌ పదార్థాలే ఇందుకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు సదరు నిపుణులు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఆహారంలో భాగంగా రోజూ రెండుమూడు వాల్‌నట్స్‌ అయినా తీసుకోవడం మేలు అంటున్నారు.