లవ్ గురూ ఇది లవ్ – ప్రొఫెసర్ ఓల్డ్ ఏజ్ లవ్. 65 ఏళ్ళ వయసులో అమ్మాయికోసం వేట

అతనో అధ్యాపకుడు. విద్యార్థులకు చక్కగా చదువు చెప్పాల్సిందిపోయి తనకంటే వయసులో 30 ఏళ్లు చిన్నదైన విద్యార్థినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. ఆ అధ్యాపకుడి పేరు మకుట్‌నాథ్.

బిహార్‌కు చెందిన ఇతను పట్నా విశ్వవిద్యాలయంలో హిందీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. 2006లో అతను పనిచేస్తున్న కళాశాలలోనే చదువుతున్న జూలీ అనే విద్యార్థినిని ప్రేమించాడు. ఇందుకు ఆ అమ్మాయి కూడా ఒప్పుకొని అతన్ని పెళ్లాడటం గమనార్హం. అక్టోబర్‌ 31న మకుట్‌నాథ్‌ పదవీ విరమణ పొందాడు. మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. ఈ విషయాన్ని అతను ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించడంతో వైరల్‌గా మారింది. ‘నేను 65 ఏళ్ల కుర్రాడిని. రిటైర్మెంట్‌ తర్వాత ఏం చేయబోతున్నానని చాలా మంది అడుగుతున్నారు. నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది. నా భార్య జూలీతో నేను పదేళ్లు కలిసున్నాను. గతేడాది ఆమె సన్యాసంలో కలిసిపోతానని నన్ను వదిలి వెళ్లిపోయింది.’ అని పేర్కొన్నాడు.

అంతేకాదు , జూలీతో కలిసున్నప్పుడు తనతో ఉన్న జ్ఞాపకాలను ఓ పుస్తకంలా రాశాడు. ఈ పుస్తకానికి ‘మకుట్‌ జూలీ కీ డైరీ’ అనే పేరు పెట్టి ఇటీవల ఓ కార్యక్రమంలో విడుదల చేశాడు.

మరో విషయం ఏంటంటే. తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌లో పెట్టగానే ఎన్నో ప్రపోజల్స్‌ వస్తున్నాయట.