సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహాడ్‌ జైల్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నెల 16 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సోమవారం వినయ్‌ శర్మ జైలు గది గోడకు తల బాదుకుని గాయపర్చుకున్నాడు.

అంతటితో ఆగకుండా ఊచల మధ్య చెయ్యి ఇరికించుకుని విరగొట్టుకోవాలని యత్నించినట్లు జైలు వర్గాల సమాచారం. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వినయ్‌ శర్మను డిశ్చార్జ్‌ చేశారు.

ఇదిలా ఉండగా, డెత్‌ వారెంట్‌ జారీ అయినప్పటి నుంచి వినయ్‌ శర్మ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండటంలేదని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ చెబుతున్నారు. కనీసం తన తల్లిని కూడా గుర్తించట్లేదన్నారు. అయితే జైలు అధికారులు మాత్రం న్యాయవాది ఆరోపణలను తోసిపుచ్చారు. శర్మ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, సైకోమెట్రీ పరీక్షల్లోనూ అతడు సానుకూలంగా స్పందించాడని వెల్లడించారు. వినయ్‌ శర్మ జైల్లో నిరాహార దీక్ష చేపట్టినట్లు ఇటీవల ఏపీ సింగ్‌ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.