మర్రిగూడ మండలం అజిలాపూర్‌కు చెందిన సరిత(22)కు కందుకూరు మండలం పోచమ్మగడ్డతండాకు చెందిన ఇస్లావత్‌రాజు(24)తో మే 2018లో వివాహమైంది. రాజు వృతిరిత్యా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయిన కొంతకాలం నుంచి రాజు తన భార్య సరితను వేధించడం మొదలుపెట్టినట్లు బంధవులె చెబుతున్నారు. రోజు మద్యంసేవించి ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఇటీవలే పెద్దల సమక్షంలో పంచాయతీపెట్టి ఇరువరికీ సర్దిచెప్పి కాపురానికి పంపించినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సరిత సోదరులకు ఫోన్‌ చేసిన రాజు మీ సోదరి కన్పించడంలేదని చెప్పాడు. శనివారం సరితను తీసుకుని కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వారికి చెప్పాడు. ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం తుక్కుగూడకు వెళ్తూ సరితను ఆటోలో ఇంటికి పంపించినట్లు ఆయన వారితో చెప్పినట్లు వారు చెబుతున్నారు. ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్న తాను ఇంట్లో సరిత కన్పించకపోవడంతో వారికి ఫోన్‌ చేస్తున్నట్లు వారికి తెలిపాడు. దీంతో రాజు వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన ఆమె సోదరులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలోనే ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడగేట్ సమీపంలో ఓమహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులు ఆనవాళ్ల సాయంతో మృతురాలు సరితగా గుర్తించి కుటుంభసభ్యులకు సమాచారమిచ్చారు. క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్‌తో సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈమేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సరిత మరణం వెనక అసలు కారణాలేమిటో తెలియాల్సి ఉంది..