అనిల్ అంబానీ.. ఒకప్పుడు టాప్ రిచెస్ట్‌‌ ఇండియన్లలో ఒకరు. టెలికం, ఇన్సూరెన్స్‌‌, ఇన్‌‌ఫ్రా సహా ఎన్నో వ్యాపారాలకు అధిపతి. వేల కోట్ల రూపాయల సంపదతో సకల సదుపాయాలూ అనుభవించారు. ఇప్పుడు పరిస్థితి తల్లకిందులయింది. ఓడలు బండ్లయ్యాయి. అప్పులు కట్టడానికి తన దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్లేదని అనిల్‌‌ కోర్టుకు తెలిపారు. అనిల్ అంబానీ నుంచి రావ్సాలిన 680 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,862 కోట్లు) కోసం మూడు చైనా బ్యాంకులు కేసులు వేశాయి.

Advertisement

దీనిపై ఆయన కోర్టుకు వివరణ ఇస్తూ ‘‘నా పెట్టుబడుల విలువ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం నా షేర్‌‌హోల్డింగ్స్‌‌ విలువ 82.4 మిలియన్‌‌ డాలర్లు ఉంటుంది. నేను కట్టాల్సిన అప్పులను లెక్కేస్తే నా దగ్గర మిగిలేది సున్నా. అప్పులు కట్టేందుకు నా దగ్గర ఆస్తులేమీ లేవు’’ అని ఆయన తెలిపారు. ఈ మూడు చైనా బ్యాంకులు అనిల్‌‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌‌ కమ్యూనికేషన్స్‌‌కు 925 మిలియన్ డాలర్ల అప్పును 2012లో ఇచ్చాయి. ఇందుకు అనిల్‌‌ పర్సనల్‌‌ గ్యారంటార్‌‌గా ఉండాలని షరతు విధించాయి.

కోర్టులో అనిల్‌‌ 565 మిలియన్ డాలర్లు డిపాజిట్‌‌ చేసేలా ఆదేశించాలని జడ్జి డేవిడ్‌‌ వేక్స్‌‌మన్‌‌ను ఇవి కోరాయి. ఇందుకు అనిల్‌‌ లాయర్ స్పందిస్తూ తన క్లయింటు దగ్గర డబ్బులు లేవని, డిపాజిట్‌‌ చేయాలని ఆదేశించడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ఆయన కోర్టులో ఒక్క పైసా కూడా డిపాజిట్‌‌ చేసే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాంకులకు పర్సనల్‌‌ గ్యారంటార్‌‌గా ఉండటానికి తాను ఒప్పుకోలేదని, ‘పర్సనల్‌‌ కంఫర్ట్‌‌ లెటర్‌‌’ మాత్రమే ఇచ్చానని, తన ఆస్తులను తనఖా పెట్టలేదని అనిల్‌‌ వాదిస్తున్నారు. అయితే అనిల్‌‌ అన్న, ముకేశ్‌‌ అంబానీ 56.5 బిలియన్‌‌ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డులకు ఎక్కారు. తమ్ముడు మాత్రం దివాలా తీశాడు.