దేశరక్షణ విధుల్లో భాగంగా మిగ్ విమానంలో పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లి అక్కడి ఆర్మీకి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ సురక్షితంగా తిరిగి భారతీయులు కోరుతున్నారు. శత్రువుకు చిక్కినా నిబ్బరంగా అతడు సమాధానాలు ఇవ్వడం చూసి గర్విస్తున్నారు. అభినందన్ నేపథ్యం గురించి వెతుకుతున్నారు. అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్‌ మార్షల్‌గా పనిచేసి రిటైరయ్యారు. అభినందన్ ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లరు ఉన్నారు. భార్య తన్వీ మెర్వాహా కూడా భారత వాయుసేనలో పైలట్ గా పనిచేసి మధ్యలోనై రిటైర్ అయ్యారు. హెలికాప్టర్ రంగంలో ఆమెకు పదేళ్ల అనుభవం ఉంది. 1600 గంటలు హెలికాప్టర్లను నడిపారు.

ఇక అభినందన్ తండ్రి సింహకుట్టి వర్థమాన్ కూడా వాయుసేనలో పనిచేస్తున్నప్పుడు అత్యుత్తమ సేవలు అందించారు. అందుకుగాను ప్రభుత్వం ఆయనకు పరమ విశిష్ట సేవా పతకాన్ని బహుకరించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్గిల్ యుద్ధనేపథ్యంలో తీసిన కాట్రు వెలియిదై(తెలుగులో చెలియా) చిత్రానికి ఆయన సలహాదారుగా వ్యవహరించారు.