కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య ఆసక్తికర సారూప్యత ఉంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, కాంగ్రెస్‌ అభ్యర్థి వెన్నెల దివంగత ప్రజాయుద్ధనౌక గద్దర్‌ కుమార్తె. వీరిద్దరూ కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేశారు. వీరిలో లాస్య ప్రాథమిక విద్య సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌లో చదవగా, వెన్నెల బొల్లారంలోని సెయింట్స్‌ ఆన్స్‌లో స్కూల్‌ విద్య పూర్తి చేశారు.

లాస్య నందిత మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశారు. వెన్నెల సైతం బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ అప్లికేషన్స్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి 2007 నుంచి 2012 వరకు మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అదే సమయంలో (2005-2009) లాస్య నందిత మల్లారెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్‌ చదివారు. ఇక అభ్యర్థులిద్దరూ దూరపు బంధువులు కావడం గమనార్హం.