ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే CM KCR సంతాప తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. “ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు కేంద్రం పటిష్టమైన వ్యూహం రచించాలి. తెలంగాణ ప్రజల పక్షాన, రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నాం. అమరుల కుటుంబాలు ఒంటరిగా లేరని చెప్పేందుకు. రాష్ట్రం పక్షాన వారికి అండగా నిలవాలని నిర్ణయించాం. వారి ప్రాణాలు తెచ్చి ఇవ్వలేం కానీ.. అమరుల కుటుంబాలు, వారి పిల్లలను సంరక్షించే బాధ్యత దేశం తీసుకోవాలి. అందుకే.. మరణించిన ఒక్కో అమరుడి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం పక్షాన రూ.25లక్షల సాయం అందించాలని తీర్మానిస్తున్నాం” అంటూ తీర్మానం ప్రవేశపెట్టారు కేసీఆర్.

“పుల్వామాలో ఉగ్రదాడి దారుణమైంది. అమానుష పాశవిక చర్యను ఖండిస్తున్నాం. 40 మంది సైనికులు ఈ దాడిలో బలయ్యారు. ప్రాణత్యాగాన్ని యావత్ దేశం మరిచిపోదు. దేశం గర్విచే వీరసైనికులను జాతి సదా తల్చుకుంటుంది. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. పెనుముప్పుగా పరిణించిన ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రజలంతా ఏకతాటిపై నిలబడాలని కోరుతున్నాం” అని కేసీఆర్ తీర్మానం చదివారు. తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు మల్లు భట్టివిక్రమార్క, మిగతా సభ్యులు బలపరిచారు.