అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన ఓ ఏపీ యువతి కలలు కల్లలయ్యాయి. విధి వక్రించి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుల జాహ్నవి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది: కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్వవి అనే యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. సియాటిల్‌ప్రాంతంలో ఉంటున్న జాహ్నవి సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం బలంగా ఢీ కొనటంతో జాహ్నవి తీవ్రంగా గాయపడింది. వెంటనే అంబులెన్సులో ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమాసింది. జాహ్నవి చనిపోయిన విషయాన్ని అధికారులు ఆమె కుటుంబసభ్యులకు చేరవేశారు. కుమార్తె మరణవార్త వినటంతో జాహ్నవి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరోవైపు ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని సియాటిల్ పోలీసులు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నాలుగు రోజుల క్రితం చికాగోలో తెలుగు విద్యార్థులపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విజయవాడకు చెందిన విద్యార్థి చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన దేవాన్ష్, హైదరాబాద్‌కు చెందిన సాయిచరణ్చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వీరు మరో విద్యార్థితో కలిసి వాల్‌మార్ట్‌కు వెళ్తున్నార ఇంతలో ఒక్కసారిగా నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీళ్లిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దేవాన్ష్ ప్రాణాలు కోల్పోగా మరోవైపు సాయిచరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పుడు జాహ్నవి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.