అమెరికాలో ముగ్గురు తెలంగాణ టీనేజర్ల సజీవ దహనం
అమెరికాలో క్రిస్మస్ పర్వదినం రోజు పెను విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు టీనేజర్లు సహా నలుగురు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. టెన్నీసీ కొలిర్‌విల్‌లోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన టీనేజర్లను సాత్వికా నాయక్, సుహాస్ నాయక్, జయ్‌గా గుర్తించారు. వీరు ముగ్గురూ తోబుట్టువులు. వీరి వయసు 14 నుంచి 17ఏళ్ల లోపే. వీరితోపాటు చనిపోయిన అమెరికన్ మహిళ కారీ కూడ్రిట్ వయసు 46.
ఆదివారం రాత్రి వీరంతా నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ అలారం మోగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రమాదంలో చనిపోయిన మహిళ భర్త, కొడుకు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన టీనేజర్ల తల్లిదండ్రులు మతప్రచారం కోసం భారత్ వెళ్లడంతో ఆ పిల్లలు ఈ ఇంట్లో ఉంటున్నారు. వీరు కొలిర్ విల్ బైబిల్ చర్చికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
క్రిస్మస్ వేడుక కోసం వీరు తమకు తెలిసిన కారీ కూడ్రిట్ ఇంటికి వచ్చారు. వీరు నల్లొండ దేవరకొండకు చెందిన వారని, అమెరికాలో చదువుకుంటున్నారని బంధువులు మీడియాకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.