స్వాతంత్ర సమరయోధుడు, హిందూ మహాసభ దిగ్గజ నాయకుడు వీర్‌ సావర్కర్‌ (వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌) జయంత్యుత్సవాలు దేశవ్యాప్తంగా జరిగాయి. దానిలో భాగంగా అఖిల భారత హిందూ మహాసభ నాయకులు ఆగ్రాలో 10, 12 తరగతుల పిల్లలకు కత్తుల్ని పంపిణీ చేశారు. హిందూ సమాజం సాధికారత సాధించేందుకు.. ముఖ్యంగా యువత ఆత్మరక్షణ, దేశ రక్షణకు జాగురూకులై ఉండేందుకు కత్తులను పంపిణీ చేస్తున్నామని హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ చెప్పారు. విద్యార్థులకు కత్తులతో పాటు భగవద్గీత ప్రతులను కూడా అందిస్తున్నామని తెలిపారు. మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆత్మ రక్షణ కోసం యువతులకు ఆయుధ శిక్షణ అవసరమని పేర్కొన్నారు.