శ్రీశైలం సమీప అడవుల్లో విషాదం చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక తల్లి, అది నయం కాదని భావించి, మరణమే మేలనుకొంది. తల్లి లేని తానెందుకని కుమారుడు సైతం బలవన్మరణానికి ఒడిగట్టాడు. బాధిత కుటుంబాల్లో శోకం నింపిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది. మృతులు తెలంగాణ వాసులుగా తేలింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన చిత్రం మాధవి(34) రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్‌లోనూ చికిత్స పొందింది. వ్యాధి నయం కాదని భావించిన ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. కొడుకు కార్తీక్‌(18)తో కలిసి ఆరు రోజుల క్రితం శ్రీశైలానికి వచ్చింది. తల్లీకొడుకులు ఇద్దరూ సాక్షిగణపతి ఆలయ సమీపంలోని అడవుల్లోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు, కొన్ని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటనపై బంధువులకు సెల్‌ఫోన్‌ ద్వారా తెలిపినట్లు సమాచారం. శుక్రవారం మృతదేహాలు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. ఆరు రోజుల కిందట చనిపోవడంతో అవి కుళ్లిపోయాయి. అడవి జంతువులు ఈడ్చుకెళ్ల డంతో అవయవ భాగాలు దెబ్బతిన్నాయి.