కరోనా ప్రభావం పలు దేశాల సినీ ఇండస్ట్రీపై కూడా పడింది. చైనాలో ఇప్పటికే సినిమా, సీరియల్‌ వంటి షూటింగ్‌ల అనుమతులను నిలిపివేసింది. అయితే కరోనా వైరస్‌ అంతగా ప్రభావం లేని తైవాన్‌ దేశం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా అక్కడి టీవీ స్టేషన్స్‌ దర్శకనిర్మాతలకు పలు సూచనలు చేసింది. నటీనటులు కరోనాతో పాటు మరే వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు లిప్‌ లాక్‌ సీన్స్‌ లేకుండా షూటింగ్‌ జరపాలని కోరినట్లు అక్కడి స్థానిక మీడియా ప్రచురించింది.

Advertisement

అంతేకాకుండా లిప్‌ లాక్‌ సీన్స్‌ ప్రభావం ప్రజలపై పడకుండా సీరియల్స్‌, సినిమాల్లో ముద్దు సన్నివేశాలను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతులను రద్దు చేసింది. కాగా, నటీనటులు ఏదైనా వైరస్‌ బారిన పడినా, అనారోగ్యంగా ఉన్నా ముద్దు సన్నివేశాల్లో పాల్గొనొద్దని ఇప్పటికే సింగపూర్‌ ఆరోగ్య శాఖ అక్కడి సినీ ఇండస్ట్రీకి సూచించింది. అంతేకాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని కోరింది