స్కూల్‌ టైం అవుతోందని ముద్దులొలికే చిన్నారిని ఉదయాన్నే తల్లి నిద్ర లేపింది. మూడో తరగతి చదువుతున్న శ్రేయాస్‌ 9years రెడీ అయి తల్లిదండ్రులకు టాటా చెప్పి ఒకటో తరగతి చదువుతున్న చెల్లి లోక్షిత (7)తో కలిసి ఉత్సాహంగా స్కూల్‌కు బయలుదేరాడు. ఈ ఇద్దరు పిల్లలను రోజూమాదిరిగా తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మేనమామ బాలకృష్ణ (25) స్కూల్‌ వద్దకు బయలుదేరాడు. మరో నిమిషంలో పాఠశాల వద్దకు చేరుకునేలోపు ఎదురుగా వచ్చిన మరో స్కూల్‌ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో శ్రేయాస్‌, బాలకృష్ణ మృతి చెందారు. లోక్షిత గాయాలతో బయటపడింది. టాటా చెప్పి వెళ్లిన కొడుకు మరణించాడని తెలియగానే బాలుడి తల్లి అక్కడకు వచ్చి, కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ హృదయ విదారకమైన ఘటన బడంగ్‌పేటలో సోమవారం ఉదయం జరిగింది. ఐదు నిమిషాల ముందు టాటా చెప్పి వెళ్లిన కొడుకు ప్రమాదంలో మరణించాడని తెలియగానే అతడి మాతృమూర్తి ఘటనా స్థలానికెళ్లి కుమారుడి మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని రోదించడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. అదే బైక్‌పై ఉన్న అతడి సోదరి స్వల్ప గాయాలతో బయటపడింది.

వనపర్తి జిల్లా, చెన్నూరు ప్రాంతానికి చెందిన పి.సురేందర్‌, రేణుక దంపతులు పదేళ్ల క్రితం బడంగ్‌పేటకు వచ్చి ఆశంగారి రెడ్డి కాలనీలో స్థిరపడ్డారు. సురేందర్‌ ఓ మెడికల్‌ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. వీరికి కొడుకు శ్రేయాస్‌(9), కూతురు లోక్షిత(7)ఉన్నారు. బడంగ్‌పేటలోగల దిల్‌సుఖ్‌నగర్‌ పబ్లిక్‌ స్కూల్‌లో శ్రేయాస్‌ మూడో తరగతి, లోక్షిత ఒకటో తరగతి చదువుతున్నారు. సురేందర్‌కు బావమరిది వరుసయ్యే బాలకృష్ణ(25) వారి ఇంట్లోనే ఉంటూ ఆటో మొబైల్‌ షోరూమ్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
పిల్లలిద్దరినీ అతడే రోజూ స్కూల్‌కు తీసుకెళ్లి సాయంత్రం తీసుకొస్తుంటాడు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో శ్రేయాస్‌, లోక్షితను బైక్‌పై ఎక్కించుకొని స్కూల్‌కు బయలుదేరాడు. నిమిషంలో పాఠశాలలోకి ప్రవేశించేవారు. అంతలోనే నాదర్‌గుల్‌వైపు నుంచి వస్తున్న లార్డ్స్‌ స్కూల్‌కు చెందిన బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడిపోయారు. బాలకృష్ణ తలపై నుంచి బస్సు టైరు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. శ్రేయాస్‌ తలకు బలమైన గాయాలవడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. లోక్షితకు స్వల్ప గాయాలవగా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రేణుక కుమారుడి మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని రోదించడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.