అనుమానం పెనుభూతమైంది. శీలాన్ని శంకించి భార్యను చంపేశాడో తాగుబోతు భర్త.
హైదరాబాద్ సనత్‌నగర్ ఇందిరాగాంధీపురం బస్తీలో నివాసముండే కృష్ణ భార్య రేణుక నాంపల్లి పోస్టాఫీసులో స్వీపర్ గా కాంట్రాక్ట్ ఉద్యోగి. భర్త కృష్ణ బహుదూర్‌పురలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పెయింటర్ గా పనిచేసేవాడు. రోజూ మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడి తీవ్రంగా కొట్టేవాడు. రోజూ పీకలదాకా తాగొచ్చి.. రేణుకను కొట్టేవాడు కృష్ణ. రోజులానే పోస్టాఫీసులో డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చిన రేణుకను తమ తండ్రి కృష్ణ బయటకు లాక్కెళ్లాడని, నాన్నతో పాటు అత్తలు కూడా అమ్మని దారుణంగా కొట్టారని, అమ్మని చంపి ఇంట్లో తెచ్చి పడేశారంటూ రోదిస్తున్నారు హతురాలి కుమార్తెలు.
మీ అమ్మ లేవడం లేదని ఓ సారి. ఉరేసుకుని చనిపోయిందని మరోసారి నాన్న చెప్పాడని, అమ్మని చంపి ఆత్మహత్య చేసుకున్నట్టుగా నాన్న చిత్రీకరిస్తున్నాడని వాపోయారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా మరో పెళ్లి కూడా చేసుకుని, చిన్న భార్యను కూడా గతంలో చంపేశాడంటున్నారు మృతురాలి కుమార్తెలు. ఇప్పుడు మళ్లీ అమ్మని చంపేశాడు, నాన్నని వదలొద్దు! అతనికి ఉరేయాలంటున్నారు హతురాలి కుమార్తెలు.