అయ్యప్ప మాల వేసుకున్నాడనే కారణంతో విద్యార్థికి పాఠశాల యాజమాన్యం అనుమతి నిరాకరించింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్నాడు. ఈ కారణంతో గత 16రోజులుగా యాజమాన్యం సదరు విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించలేదని విద్యార్థి తండ్రి శివారెడ్డి ఆరోపించారు.

విషయం తెలుసుకున్న అయ్యప్పస్వాములు పాఠశాల ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై యాజమాన్యాన్ని వారు వివరణ కోరగా ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లిన ప్రిన్సిపల్‌ ఎంతసేపటికీ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ గదిలోకి దూసుకెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అయ్యప్ప స్వాములకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గతంలో ఇదే పాఠశాలలో గణపతి మాల వేసుకున్న విద్యార్థిని సైతం పాఠశాలలోకి అనుమతించలేదని వారు ఆరోపించారు.