ఆస్తి కోసం కడతేరుస్తారనుకోలేదమ్మా ఎంతటి నరకయాతన అనుభవించావో కదా ఒక్కసారి మేమైనా నీకు గుర్తుకు రాలేదా తల్లి? ఈ దుర్మార్గులను వదిలేసి వచ్చుంటే కంటికి రెప్పలా చూసుకునేవాళ్లం కదమ్మా? అంటూ మృతురాలి తల్లిదండ్రుల రోదనలతో ఉరవకొండ ఆస్పత్రి ఆవరణం మారుమోగింది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు: ఉరవకొండలోని మాస్టర్‌ సీవీవీ నగర్‌లో నివాసముంటున్న శివరాంపేట మల్లికార్జున కుమారుడు కురుబ వినోద్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన ఓబులేసు, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె శిరీష (26)తో 2020, నవంబర్‌ 21న వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.2 లక్షల వరకట్నం, 26 తులాల బంగారు నగలను వధువు తల్లిదండ్రులు ఇచ్చారు. పెళ్లి ఖర్చులకు తండ్రి తన భూమిని విక్రయించాడు. అంతేకాక కుమార్తె జీవితం బాగుంటుందని భావించిన అతను బుక్కరాయసముద్రంలో విలువైన ఐదు సెంట్ల స్థలాన్ని శిరీష పేరున రాసిచ్చాడు.

అయితే, ఆ స్థలాన్ని తన పేరున రిజిస్టర్‌ చేసివ్వాలంటూ వినోద్‌ మొండిపట్టుపట్టాడు. ఈ విషయంగానే తరచూ భార్యను వేధించేవాడు. శారీరకంగా హింసించేవాడు. వినోద్‌తో పాటు అతని తల్లి సుజాత, అక్క భారతి, బావ ధనుంజయ, మేనమామ ప్రకాష్‌ సైతం శిరీషను చిత్రహింసలకు గురి చేసేవారు. ఏడాది క్రితం గర్భిణి అయిన శిరీషను ఇంట్లోంచి వెల్లగొట్టడంతో పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చారు. అయినా వినోద్, వారి కుటుంబసభ్యుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే శిరీష ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో ఇంట్లోనే మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, ఓబులేసు, సోదరుడు శివప్రసాద్‌ ఆగమేఘాలపై ఉరవకొండకు చేరుకున్నారు. ఆస్పత్రిలోని మార్చరీలో ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్, ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు. కాగా, మృతురాలికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు.