తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

Advertisement

వివరాలు: అలిరాజ్‌పూర్‌ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన పందొమ్మిదేళ్ల అమ్మాయి కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. వేరే తెగకు చెందిన వ్యక్తితో కలిసి వెళ్లిందనే విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు యువతిని వెదికి పట్టుకున్నారు. స్వగ్రామానికి తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారు. అనంతరం అర్ధ నగ్నంగా మార్చి ఇంట్లోని మగ వాళ్లంతా బెత్తంతో ఆమెను కొడుతూ గ్రామంలోని రోడ్ల వెంట తిప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌ కావడంతో ఈ దురాగతం పోలీసుల దృష్టికి వచ్చింది.ఈ విషయంపై స్పందించిన అలీరాజ్‌ పూర్‌ ఎస్పీ మాట్లాడుతూ వాట్సాప్‌ ద్వారా వచ్చిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.