అర్ధరాత్రి రహస్యంగా కలుసుకున్న ప్రేమికులను గమనించిన గ్రామస్తులు ఆ జంటకు అదే రాత్రి పెళ్లి చేశారు. పంచాయతీ సభ్యుల ఆదేశాల మేరకు పూజారిని పిలిపించి మరీ సంప్రదాయబద్ధంగా వివాహ తంతు జరిపించారు. ఈ ఘటన బిహార్‌లోని మోతీహారీ జిల్లాలో చోటుచేసుకుంది.

Advertisement

వివరాలు: కోన్హియా అనే గ్రామానికి చెందిన ఓ యువతి పక్క గ్రామానికి చెందిన యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఆమెను కలిసేందుకు సదరు యువకుడు కోన్హియాకు వచ్చాడు. వీళ్ల వ్యవహారాన్ని కొద్దికాలంగా గమనిస్తున్న గ్రామస్తులు ఆరోజు ఎలాగైనా ప్రేమికులిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో వందల సంఖ్యలో గ్రామస్తులు ఒక్కచోట పోగయ్యారు. వీరంతా ప్రేమజంటను సమీపిస్తుండగా యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అతడిని పట్టుకున్న గ్రామస్తులు తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని ప్రశ్నించారు. అందుకు అతడు అంగీకరించడంతో యువతిని కూడా పెళ్లి విషయమై అభిప్రాయం చెప్పాలని అడిగారు.

ఆమె కూడా ఇందుకు సమ్మతించడంతో అప్పటికప్పుడు పూజారిని పిలిపించి జంటకు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు కోన్హియాకు చేరుకునే ముందే ప్రేమజంట వివాహం జరిగిపోయింది.