ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆర్‌టిసి కార్మిక నేతలు కూడా ఇక నుంచి సాధారణ కార్మికుల మాదిరి విధులు నిర్వహించాలి. ఇప్పటి వరకు యూనియన్ నేతలకు కల్పించిన డ్యూటీ రిలీఫ్ హక్కులను యాజమాన్యం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఆర్‌టిసి సంఘాల జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా నేతలంతా డ్యూటీలు తప్పనిసరిగా చేయాలి. ఇతర కార్మికులు మాదిరిగానే విధులకు హాజరుకావాలి. లేనిపక్షంలో గైర్హాజరుగా పరిగణిస్తారు. కాకుంటే సెలవు పెట్టుకోవాలి. మొత్తం 30 మంది కార్మిక నేతలకు ఇప్పటి వరకు డ్యూటీ మినహాయింపు ఉంది.

ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టిఎంయు)కు చెందిన వారు 26 మంది ఉన్నారు. అదేవిధంగా కార్మికుల నుంచి యూనియన్ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో అధికారులు స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌టిసిలో ప్రతి కార్మికుడు ఏదో సంఘానికి అనుబంధంగా ఉంటారు. ఏడాదికి వెయ్యి రూపాయలు సభ్యత్వం కింద ఒక్కో కార్మికుడు చెల్లిస్తారు. కార్మికులు ఇచ్చిన సమ్మతి లేఖ ఆధారంగా ఆ మొత్తాన్ని జీతం నుంచి యాజమాన్యమే వసూలు చేసి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న సంఘాలకు చెక్కురూపంలో అందజేస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానాన్ని నిలిపివేయాలని యాజమాన్యం యోచిస్తుంది.

గతంతో ఒకసారి కూడా కార్మిక సంఘాల నేతలకు విధుల మినహాయింపు, యూనియన్ సభ్యత్వ రుసుమును యాజమాన్యమే వసూలు చేసే విధానాన్ని ఎత్తివేశారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న టిఎంయు కార్యాలయాలకు ఇప్పటికే తాళాలు వేశారు. అయితే ఇందుకు జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కూడా స్పందించారు. “నేను డ్రైవర్‌ను, డ్యూటీ చేస్తా అవసరమైతే సెలవు తీసుకుంటా” అని ఆయన చెప్పారు. కార్మిక నేతలకు ఇస్తున్న డ్యూటీ రిలీఫ్‌ను తొలగించడం సరికాదని ఆక్షేపించారు. అవసరమైతే యూనియన్ నేతలంతా డ్యూటీలకు వెళ్తామమని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు…