చుట్టూ కొండలు ! మధ్యలో నీరు ! వేలాడే వంతెన !! ఈ సిత్రాలు భలే ఉన్నాయి కదా. ఇవి ఎక్కడో కాదు .. మన .లక్నవరం సరస్సువి !!
ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఈ సరస్సు తెలంగాణలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా పేరుతెచ్చుకుంది . ఇక్కడి పరిసరాలు , సరస్సు , మధ్యలోనిదీవులు పర్యాటకానికి అనువుగా ఉండటంతో పర్యాటకశాఖ అదనపు హంగులు అద్దు తోంది . మొదట ఈ సరస్సు పై హరిద్వార్ తరహాలో రాష్ట్రంలో మొట్టమొదటి వేలాడే వంతెనను నిర్మించారు . కాకతీయుల కళాసంపదను తిలకించేందుకు వీలుగా దీనిని రూపొందించారు . సరస్సులో ఆరు దీవులను ఆరు రకాలుగా ముస్తాబు చేసి , పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లను చేస్తోంది .సెలవు దినాల్లోనే కాకుండా మిగతా రోజుల్లో ప్రాంతానికి చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు ..

మరో వేలాడే వంతెన :
లక్నవరం సరస్సుకు వెళ్తే మనసు దోచే ఎన్నో అందాలు ఆకట్టుకుంటాయి . 160మీటర్ల పొడవు ఉన్న వేలాడేవంతెనపై పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం పొందుతున్నారు , అలలపై పయనించేందుకు బోటింగ్ , భజన వసతి కోసం రెస్టారెంట్ , విశ్రాంతి కోసం కాటేజీలు ఉన్నాయి . కొత్తగా మరో వేలాడే వంతెన కూడా టూరిజం అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు . దాంతో రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది…

చారిత్రక ఆనవాళ్లు :
కాకతీయులు చెరువులు నిర్మించిన ప్రతిచోట ఆలయ నిర్మాణాలు చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది . కానీ లక్నవరం , పాకాల సరస్సులను , మాత్రం వ్యవసాయ కేంద్రాలుగానే భావించినట్లు తెలుస్తోంది . లక్నవరం దగ్గర ఉన్నబుస్సాపూర్ గ్రామంలో , అడవుల్లో చిన్న చిన్న గుడులు కట్టారు. రామలింగేశ్వరుడి ప్రతిష్టించిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి . పాడిపంటలు బాగా పండాలని కాకతీయులు ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది …
