ప్రధాన రోడ్డులో ఆగి ఉన్న ధాన్యం ట్రాక్టర్‌ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది.

నర్సంపేట పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన ఆలకుంట సాంబయ్య(25) సొంత పనిమీద ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ వెళ్లాడు. రాత్రి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికొస్తున్నాడు. అప్పటికే ధాన్యం బస్తాల లోడుతో నర్సంపేటకు వస్తున్న ట్రాక్టర్‌ పట్టణ శివారులోని దామెర చెరువు సమీపంలోకి రాగానే టైరు పగలడంతో డ్రైవర్‌ అక్కడే నిలిపి వెళ్లాడు. రాత్రి వేళ అశోక్‌నగర్‌ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడు సాంబయ్య వేగంగా ఆగి ఉన్న ధాన్యం లోడు ట్రాక్టర్‌ కిందకు దూసుకు పోయాడు. నుదుటి భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి కొద్ది నెలల క్రితం వివాహమైందని, భార్య గర్భిణి అని బంధువులు తెలిపారు. నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే మార్గంలో ట్రాక్టర్‌ నిలిపి వెళ్లడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.