రాజయ్య గోబ్యాక్

రఘునాథపల్లి మండలకేంద్రంలో గురువారం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులంతా సమావేశమయ్యారు. దీనికి మండలం నుంచి 200 మంది ఉద్యమకారులు హాజరయ్యారు. అయితే, సమావేశం జరుగుతున్న సమయంలోనే తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అక్కడికి చేరుకోగా ఆగ్రహానికి గురైన ఉద్యమకారులు ఒక్కసారిగా రాజయ్య గోబ్యాక్‌ అంటూ’ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. సీనియర్‌ నాయకులు నామా ల బుచ్చయ్య, పెండ్లి మల్లారెడ్డి ఉద్యమకారులకు నచ్చజెప్పడంతో శాంతించారు.

మాజీ సర్పంచు గూడ సునిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ఇంతకు ముందు ఉద్యమకారులకు తనవల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించాలన్నారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేందుకు అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ జెండా పట్టానని తెలిపారు. తన ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిన కేసీఆర్‌ మరోసారి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చారని తెలిపారు. ‘కారు – కేసీఆర్‌’ నినాదంతో ప్రతీ ఒక్కరు లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేలా పనిచేసి కేసీఆర్‌ ఆశించిన బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని కోరారు.

రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.