ఆటో, కారు ఢీకొనడంతో తల్లీబిడ్డలు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. టి.సుండుపల్లె ఎస్‌ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా: మంగళవారం సాయంత్రం రాయచోటి నుంచి సుండుపల్లెకు ఆటో వెళ్తోంది. ట్రాక్టర్‌ను ఓవర్‌ టేక్‌ చేయబోయి అలాగే కుడివైపు ముందుకెళ్లాడు. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి కుడివైపున ఉన్న గుంతలో పడిపోవడంతో ఆటోలో ఉన్న సుండుపల్లె మండలం భాగ్యంపల్లెకు చెందిన షేక్‌ ఫరీదాతో (27)పాటు ఆమె చంటిబిడ్డ (రెండు నెలల వయసు) తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నించగా అప్పటికే వారు ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చరీలో ఉంచారు. అలాగే ఆటో ఉన్న మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.