సహజీవనం సాగిస్తున్న ఓ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న అన్నోజిగూడలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో జరిగింది. ఘట్‌కేసర్‌ Ci రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం: నగరంలోని అల్వాల్‌కు చెందిన కారు డ్రైవర్‌ మున్నామల్లేష్ ‌(26), సుచిత్ర ప్రాంతంలో నివాసముండే బి.పార్వతి (40) లు కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల రాజీవ్‌గృహకల్ప కాలనీలోని 4వ నంబర్‌ ప్లాట్‌లోని స్నేహితుడి ఇంటికి వచ్చారు. రెండ్రోజుల అనంతరం స్నేహితుడు సైతం ఇదేంటని మందలించడంతో అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.

నాలుగు రోజుల క్రితం మళ్లీ రాజీవ్‌ గృహకల్పకు వచ్చిన మల్లేష్‌, పార్వతిలు స్నేహితుడిని అడిగి ఇంటి తాళం తీసుకున్నారు. ఇంతలో ఏమైందో కాని ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు శనివారం పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ రెండు మృతదేహాలు కనిపించాయి. కాగా మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో మూడ్రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి నగరంలో ఉంటున్నట్లు తెలిసింది. వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపారు.