గంటల పాటు ఎదురు చూపుల అనంతరం శుక్రవారం రాత్రి వాయుసేన వింగ్ కమాండర్‌ అభినందన్‌ వాఘా – అటారి సరిహద్దు ద్వారా భారత్‌కు చేరుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు, విజువల్స్‌ అనేకం మీడియాలో ప్రచురితమయ్యాయి. అయితే ఆ సమయంలో ఆయనకు తోడుగా ఓ మహిళ రావడం కనిపించింది. ఆమె అధికారిణా లేక బంధువా అనే ఆలోచన అందరిలో మొదలైంది. ఇంతకీ ఆమె ఎవరంటే. ఆమె పేరు డాక్టర్ ఫరీహా బుక్టి. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలో భారత వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిణి. ఆమె FFP. అంటే మన భారత్‌లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌తో సమానం. పాకిస్థాన్‌లో గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆ దేశ జైల్లో మగ్గుతున్న కుల్‌భూషణ్‌ జాదవ్ కేసును పర్యవేక్షించే పాక్‌ అధికారుల్లో ఆమెది కీలక పాత్ర. గతంలో జాదవ్‌ను కలవడానికి వెళ్లిన ఆయన కుటుంబంతో ఈ పాక్‌ అధికారిణి కూడా హాజరయ్యారు. అభినందన్ అప్పగింత సమయంలో బుగ్టి. రాత్రి 9:20 గంటల ప్రాంతంలో ఆయనతో పాటు జీరో లైన్‌ వరకు నడుస్తూ కనిపించారు….