హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ అదనపు బాధ్యతలను కె.ఆమ్రపాలికి అప్పగించారు. ప్రస్తుతం ఆమె హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ గా ఉన్నారు. ఈమేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలి ఇప్పటికే హెచ్ఎండీఏ ఐటీ, ఎస్టేట్ విభాగాలతోపాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెలవలప్‌మెంట్‌ ఎండీగా కూడా కొనసాగుతున్నారు.

గతంలో ఆమె కేంద్రంలో విధులు నిర్వహించారు. ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా రేవంత్ రెడ్డి సర్కారు కీలక బాధ్యతలు అప్పగించింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా అత్యంత చురుకైన ఐఏఎస్ లలో ఆమె ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌ హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6న హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. శనివారం హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వచ్చిన ఆయన వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.