రాజ్యసభ సభ్యురాలు ఆర్డర్‌ చేసిన ఆమ్లెట్‌లో కోడిగుడ్డు పెంకులు రావడాన్ని ఎయిర్‌ఇండియా తీవ్రంగా పరిగణించింది. విమానంలో ఆహారాన్ని సరఫరా చేసిన క్యాటరింగ్‌ ఏజెన్సీకి భారీ స్థాయిలో జరిమానా విధించింది. నిర్వహణ ఛార్జీలు, విమానం మొత్తం సరఫరా చేసిన ఆహారానికి అయిన ఖర్చును భరించాలని ఆదేశించింది.

నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్‌ ఈ మధ్యే పుణె నుంచి దిల్లీకి ఎయిర్‌ఇండియా విమానంలో వెళ్లారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ఆమె ఆమ్లెట్‌ను ఆర్డర్‌ చేశారు. ఆమెకు అందించిన ఆమ్లెట్లో కోడిగుడ్డు పెంకులు వచ్చాయి. ఆహారం సైతం నాణ్యంగా లేకపోవడంతో ఆమె ఎయిర్‌ ఇండియాకు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

కొన్నిరోజుల క్రితం ఎయిర్‌ ఇండియా విమానంలో పుణె నుంచి దిల్లీకి వెళ్లాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్‌ ఆర్డర్‌ చేశాను. తింటున్నప్పుడు మూడు నాలుగు సార్లు కోడిగుడ్డు పెంకులు తగిలాయి. బంగాళాదుంప ముక్కలు పాడయ్యాయి. సోయాచిక్కుడు ఉడకనేలేదు. ఎయిర్‌ హోస్టెస్‌ దీనికి నేరుగా బాధ్యులు కారని అనుకుంటున్నాను. ఈ విషయం వారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వచ్చిన స్పందన బాధించింది. ట్వీటు చేయాలా? అనిపించినప్పటికీ ప్రజా ప్రయోజనార్థం తప్పదనుకున్నా’ అని వందనా చవాన్‌ ట్వీట్‌ చేశారు. విమానయాన శాఖ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, ఎయిర్‌ ఇండియా చైర్మన్‌ ట్విటర్ ఖాతాలను ట్యాగ్‌ చేశారు.