ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారమే అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.

సీఎం శ్రీ కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండి శ్రీ సునిల్ శర్మ, ఇ.డి.లు, ఆర్ఎంలు, డివిఎంలు, డిఎంలు, కంట్రోలర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి మద్యాహ్న భోజనం చేసిన కేసీఆర్, తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతీ అంశంపైనా, ప్రతీ సమస్యపైనా సిఎం స్పందించారు. అప్పటికప్పుడు పరిష్కరించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాలు:

  1. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి.
  2. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం.
  3. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం
  4. ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం
  5. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.
  6. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
  7. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.