కుటుంబసభ్యులతో కలసి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్న నవ వధువు కనిపించకుండా పోయింది. అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు: ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన మాదేశ్వరికి రామగిరికి చెందిన ఓ యువకుడితో మూడు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులతో కలసి అనంతపురం బస్టాండుకు మాదేశ్వరి చేరుకుంది.

ఆ సమయంలో తాను అత్తింటికి వెళ్లనంటూ మాదేశ్వరి తెలపడంతో తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత బాత్రూంకు వెళుతున్నట్లు చెప్పిన మాదేశ్వరి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బస్టాండు, ఆ పరిసర ప్రాంతాలు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.