పరకాల: వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. గతంలో మోటారు సైకిల్‌పై ఇంటింటికి తిరుగుతూ బడిబాట నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్. బుధవారం పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేలా గ్రామంలోని ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘ఆ గట్టునుంటావా.. విద్యార్థి ఈ గట్టు కొస్తావా’ అనే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే రూ.25వేల ఖర్చు ఉంది. ప్రభుత్వ పాఠశాలకు వస్తే నాణ్యమైన ఉచిత విద్యతో పాటు స్కూల్ ఫీజు, పాఠ్యపుస్తకాలు, భోజనం, యూనిఫాం ఉచితం అంటూ పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీలను గ్రామంలోని తల్లిదండ్రులు, యువత ఆసక్తికరంగా చూడసాగారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రధానోపాధ్యాయుడు చేపట్టిన ఈ కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.