ఆడపిల్లగా పుట్టడమే ఆ శిశువు చేసిన పాపం. అమ్మ వెచ్చటి పొత్తిళ్లలో తలదాచుకోవాల్సిన చిన్నారులను నిర్దాక్షణ్యంగా రోడ్డుపాలు చేస్తున్నారు. మానవత్వమున్న మనుషులమని మరిచిపోతున్నారు. ఆడ శిశువని భారం దించుకొనేందుకో, కారణమేదైతేనేం, దుర్మార్గుల్లా మారుతున్నారు.అప్పుడే పుట్టిన ఆడ శిశువును గోనె సంచిలో కట్టి చెత్తబుట్టలో పడేశారు మానవత్వం లేని మనుషులు. నవ మాసాలు మోసి , కని పెంచిన ఆ తల్లికి బిడ్డ భారం అయ్యింది. అటుగా వెళ్తున్న వారు పాప ఏడుపు విని.. పోలీసులకు సమాచారం అందించారు. సికింద్రాబాద్ మోండ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బైబుల్ హౌజ్ ఫుట్‌పాత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారిని చూసి చలించిపోయిన పోలీసులు , పాపకు పాలు పట్టించి. గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.శిశువు తల్లి ఎవరన్నదానిపై ఆరా తీస్తున్నారు….