వారు చూపు పడితే– ఏ నగల దుకాణంలోని నగ అయినా వారి హస్తలాఘవానికి అదృశ్యం కావాల్సిందే. దుకాణ యజమానుల్ని మాటల్లో పెట్టి, తెలివిగా నగలు కొట్టేసే ఐదుగురితో కూడిన సభ్యుల ముఠాలో నలుగురు మహిళలైతే, వారికి నాయకురాలు కూడా మహిళే కావడం గమనార్హం! వీరిపై నాలుగు జిల్లాల్లో కేసులు ఉండటం చూస్తే చోరీల్లో వీరెంత మహా ముదుర్లో , కల్లూరులోని రోషన్‌ నగల దుకాణంలో ఈనెల 6 మంగళవారం ఐదుగురు వ్యక్తులు నగలు కొనేందుకు వచ్చారు. షాపు యజమానిని మాయమాటలతో మభ్య పెట్టి, అతని దృష్టి మరల్చి, షాపులో సుమారు ఒక కేజీ 470 గ్రాముల బరువు కలిగిన 12 జతల కాలి పట్టీలు, కాలి గొలుసులు దొంగలించి ఉడాయించారు. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలో రికార్డయిన నిందితుల ముఖచిత్రాలు కీలకమయ్యాయి. బుధవారం దొంగల గురించి పక్కా సమాచారం అందడంతో కల్లూరు సమీపంలోని చెరకువారిపల్లె బస్‌ స్టాప్‌ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఆటోలో వస్తున్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా వాల్మీకిపురం మండలం, చింతలవారిపల్లె పంచాయతీ బోయపల్లెకు చెందిన వారని, వీరంతా బంధువులేనని తేలింది. వీరు ఒక ముఠాగా ఏర్పడి ఐదేళ్ల కాలంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. వీరిపై చిత్తూరు, వైఎస్సార్‌ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.