భూకబ్జాలో దర్జా వెలగబెడదామనుకుంటే ఆ ముగ్గురు కార్పొరేటర్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందట. అధికార పార్టీ కార్పొరేటర్‌లం మాకు ఎవరు అడ్డు కల్లకు పొరలు కమ్మి కార్పొరేషన్ సిబ్బందిని, మహిళా అధికారిని నానా దూర్బాషలాడి కబ్జాను సమర్థించే పనిచేసి, ఎమ్మెల్యే మనుషులమని చెప్పి ఆయన ప్రమేయం లేకున్నా పేరును వాడుకుని కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్న ఆ ముగ్గురికి పోలీసులు త్వరలోనే చెక్ పెట్టబోతున్నట్లు తెలిసింది. భూవివాదం కోర్టులో ఉండగా అవేం పట్టించుకోకుండా అనుమతులు రాకున్న భవన నిర్మాణానికి పూనుకున్న వీరికి త్వరలోనే అరదండాలు తప్పవని తెలిసింది.
అరెస్ట్‌కు రంగం సిద్దం…?
హన్మకొండ చౌరస్తాకు అతి సమీపంలో కాకాజి వారసులకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం కొనసాగిస్తున్న ముగ్గురు కార్పొరేటర్ల అరెస్ట్‌కు రంగం సిద్దం అయినట్లు విశ్వసనీయ సమాచారం. మూడునెలల క్రితం ఈ కార్పొరేటర్లు చేస్తున్న కబ్జా తతంగంపై ‘నేటిధాత్రి’ ఓ కథనాన్ని వెలువరించింది. అడ్డు, అదుపు లేకుండా కార్పొరేటర్ల విచ్చలవిడితనాన్ని ప్రశ్నించింది. పదవి రాగానే జనం కంటికి పురుగుల్లా కనపడితే ఏంచేసిన చెల్లుతుందనే వారి గర్వాన్ని నిలదీసింది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ రంగంలోకి దిగి ఇంటలిజెన్స్ విచారణను పూర్తిచేసి అది పక్కా కబ్జా పర్వమేనని తేల్చినట్లు సమాచారం. కబ్జాకు పాల్పడిన ఆ ముగ్గురు కార్పొరేటర్లను త్వరలోనే అరెస్ట్ చేయనున్నారని తెలుస్తోంది.
అధిష్టానం సీరియస్ ?
ఓ వైపు కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, అవినీతికి అసలు అస్కారం ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలు దీంతో హన్మకొండలో ఆ ముగ్గురు కార్పొరేటర్లు చేసిన కబ్జాపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేసే పని ఎవరు చేసిన సహించేది లేదని ముగ్గురు కార్పొరేటర్ల అరెస్ట్‌తో సంకేతాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అరెస్ట్ కాకుండా పైరవీలు ?
అక్రమ కబ్జాకు పాల్పడి అడ్డంగా బుక్కైన ఆ ముగ్గురు కార్పొరేటర్లు అరెస్ట్ కాకుండా ఉండేందుకు పైరవీల బాట పట్టినట్లు తెలిసింది. మరో నాలుగైదు రోజుల్లో పోలీసులు వీరిని అరెస్ట్ చేయడానికి సిద్దం అవుతుండగా అదికార పార్టీలో తమకు తెలిసిన పెద్దల సహయాన్ని కోరి అరెస్ట్ కాకుండా చూడాలని వేడుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో అధిష్టానం సీరియస్‌గా ఉండడం, అరెస్ట్‌కు అంత సిద్దం కావడంతో తమ వల్ల కాదని చేతులెత్తేసినట్లు సమాచారం.