ఓ భార్య, భర్తతో గొడవపడి ప్రాణాలు తీసుకుంది. చదువు విషయంలో భర్త తన మాట కాదన్నాడని ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు: మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన గౌరవ్‌కు, అదే ప్రాంతానికి చెందిన ఇందు తివారీకి 2017లో పెళ్లి జరిగింది. వీరికి ప్రస్తుతం ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు జరగటం మొదలయ్యాయి. ప్రతీ విషయంలో ఇద్దరూ కీచులాడుకునే వారు. కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలు చదువు విషయంలో గొడవపడ్డారు. ఇందు తాను చదువుకుంటానని పట్టుబట్టింది. అయితే, ఇందుకు గౌరవ్‌ ఒప్పుకోలేదు చదువుకు సంబంధించిన ఫామ్‌ నింపటానికి కూడా అతడు అంగీకరించలేదు.

దీంతో ఇద్దరూ బాగా గొడవపడ్డారు. అదే రోజు రాత్రి గౌరవ్ తన గదిలో నిద్రపోగా ఇందు వేరే గదిలో నిద్రపోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అర్థరాత్రి ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. ఉదయం ఎంతకీ గది తలుపు తీయకపోవటంతో గౌరవ్‌కు అనుమానం వచ్చింది. తలుపులు బద్దలు కొట్టాడు భార్య విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురి మరణానికి అత్తింటి వారి వరకట్న వేధింపులే కారణమని ఇందు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు భర్త, మామను అరెస్ట్‌ చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.