యువసేనలు, అభిమాన సంఘాలను అంగీకరించబోనన్న KTR

తన పైన అభిమానం ఉంటే టిఆర్ఎస్ పార్టీ లేదా పార్టీ అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని కేటీఆర్

ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంఘాలను వెంటనే రద్దు చేసుకోవాల్సిందిగా కోరిన కేటియార్

తన పేరు మీద ఏర్పాటు చేస్తున్న వివిధ సంఘాలు, యువసేన లు, అభిమాన సంఘాలకు తన వైపు నుంచి ఎలాంటి మద్దతు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు తెలిపారు. కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్, కేటీఆర్ అభిమాన సంఘం వంటి పేర్లతో పలువురు సంఘాలను ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటిని తాను ఏమాత్రం ఆమోదించంబొననిని ఆయన తెలిపారు. తన పైన, పార్టీ పైన అభిమానంతో ఏర్పాటు చేసే సంఘాలను సైతం తన ఆమోదం లేదని తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో తన పేరుతో ఏర్పాటు చేసిన సంఘాలను వెంటనే రద్దు చేసుకోవాలన్నారు. దీంతో పాటు ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ను కేటిఆర్ యువసేన, కేటియార్ అభిమాన సంఘం వంటి వివిధ పేర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు సైతం వాటిని వెంటనే ఆపేయాలని కోరారు. పార్టీ పైన, తన పైన అభిమానం ఉంటే కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో కానీ పార్టీ అనుబంధ సంఘాల తో కానీ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్ యువసేన పేరుతో తనను కలిసిన పలువురు కార్యకర్తలను ఈ సందర్భంగా మంత్రి సంఘాల్ని రద్దు చేసుకోవాల్సిందిగా కోరారు. వారందరిని టిఆర్ఎస్ లో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా కోరారు.