వేగంగా దూసుకొచ్చిన లారీ హోండా యాక్టివాను ఢీ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి.
మోహన్‌నగర్ ప్రజయ్ నివాస్-2లో ఉండే ప్రైవేటు ఉద్యోగి కీర్తికుమార్‌రెడ్డి కుమార్తె సాధన (20), నాగోల్ స్నేహపురి కాలనీలో ఉంటూ లిఫ్టు మరమ్మతు లు చేసే రామబ్రహ్మం ఒక్కగానొక్క కుమార్తె నవ్యశ్రీ (20) తట్టిఅన్నారం సమీపంలోని శ్రేయాస్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. నవ్యశ్రీకి కాలేజీలో పని ఉందని సాధనతో కలిసి ఆదివారం మధ్యాహ్నం యాక్టివాపై బయలుదేరారు. మాట్లాడుకుంటూ బండ్లగూడ ఆర్టీసీ బస్‌డిపో వద్దకు చేరుకున్నారు.
ఆదివారం కాలేజీలో ఎవరూ ఉండకపోవచ్చని భావించి బండిని యూటర్న్ తీసుకుని వెనుదిరిగారు. 1.30 గంటలకు వారు ఆనంద్‌నగర్ సమీపంలో గల ఆంధ్రాబ్యాంకు వద్దకు రాగానే తట్టిఅన్నారం నుంచి వేగంగా వస్తున్న లారీ వీరి యాక్టివాను వెనుకనుంచి ఢీకొట్టింది. యాక్టివాపై వెనుక కూర్చున్న నవ్యశ్రీ లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో సాధనకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నవ్యశ్రీ తల్లి, స్నేహితులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.