• కమిషనర్ తో కలిసి పారిశుధ్య విధానాల పరిశీలన.
  • ఇక్లి ఆహ్వానం మేరకు ఇండోర్ లో పారిశుధ్య అధ్యయన యాత్ర.

ఇండోర్ లో అవలంబిస్తున్న పారిశుధ్య విధానాల తీరు అద్భుతం అని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు. ఇక్లీ (ICLEI International Council for Local Environmental Initiatives ) ఆహ్వానం మేరకు జిడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, బల్దియా కు చెందిన ఇతర ఉన్నతాధికారుల బృందం మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ లో ప్లాస్టిక్ ఫ్రీ సిటీ నిమిత్తం అధునాతన పద్దతులతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అమలు, అవలంబించ బడుతున్న శానిటేషన్ విధానాల అధ్యయన యాత్ర( స్టడీ టూర్) జరిగింది. ఈ సందర్భంగా వారు శుక్రవారం ఇండోర్ లోని ఎం.ఆర్.ఎఫ్ (మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ) యూనిట్, బయో గ్యాస్ ప్లాంట్, బయో మైనింగ్ ప్లాంట్ తో పాటు సి ఎన్ డి (కన్స్ట్రక్షన్ అండ్ డేమాలిషన్) వ్యర్ధాల నిర్వహణ,ఇంటిగ్రేటెడ్ కమాన్ కంట్రోల్ సెంటర్ (ఐ.సి.సి.సి) లను సందర్శించి వారు అవలంబిస్తున్న పద్దతులను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బయో గ్యాస్ ప్లాంట్ సందర్శన లో భాగంగా తడి చెత్త ను ఉపయోగించి మీథేన్ గ్యాస్ ను ఉత్పత్తి చేసే ప్రక్రియను పరిశీలించిన క్రమం లో ఇండోర్ అధికారులు గ్యాస్ వినియోగ తీరును వివరిస్తూ 50% స్థానిక అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు మరో 50% ప్రైవేటు సంస్థ లకు వారికి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బయోమైనింగ్ ద్వారా చెత్తను ఖననం చేసే విధాన అధ్యయనంతో పాటు కన్స్ట్రక్షన్ అండ్ డేమాలిషన్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు. ప్రాథమిక ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలనలో భాగంగా తడి, పొడి చెత్తను స్థానిక ప్రజలు వేరు వేరుగా అందించడం జరుగుతుందని, స్వచ్ఛ ఆటోలు అట్టి చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్ లకు అక్కడి నుండి కాంపాక్టర్ ల ద్వారా ప్రాసెసింగ్ ప్లాంట్ కు తరలిస్తారని వివరించారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన నేపథ్యం లో నిర్వాహకులు ఇక్కడ జరిగే ప్రక్రియ ను వివరిస్తూ ప్రతి స్వచ్ఛ ఆటో, వాహనాలు జిపిఎస్ ట్రాకింగ్ సిస్టం తో అనుసంధానించ బడిందని, చెత్త సేకరణకు వినియోగించే ప్రతి స్వఛ్చ ఆటోకు నిర్దిష్ట ఏరియాను (రూట్ మ్యాప్) కేటాయించడం జరుగుతుందని , ఇంటిగ్రేటెడ్ కమాన్డ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వహించే ఆపరేటర్లు స్వచ్ఛ ఆటో వారితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సమాచారాన్ని బదిలీ చేసుకోవడం ద్వారా ఖచ్చితమైన ప్రాసెసింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ: వరంగల్ మహా నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ నిర్వహణకు ఇక్లి సంస్థ సహకరిస్తున్న నేపధ్యంలో ఇక్లి వారు ఇండోర్ లో అవలంబిస్తున్న అధునాతన పద్దతులతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అమలు శానిటేషన్ విధానాలను కమిషనర్ ప్రావీణ్య తో కలసి అధ్యయనం చేయడం జరిగిందని, వరంగల్ మహా నగరంలో ఈ విధానాలను అమలు చేసి స్వచ్ఛ సర్వేక్షన్ లో అగ్ర భాగాన నిలిపేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ పర్యటనలో బల్దియా ఆరోగ్యాధికారి డా. రాజేష్, ఈ ఈ సంజయ్ కుమార్ తో పాటు ఇక్లీ ప్రాజెక్టు మేనేజర్లు అనురాధ, రీతు తదితరులు పాల్గొన్నారు.