గుజరాత్‌కు చెందిన అశోక్‌ బరోట్‌(27) బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన అశోక్‌కు తండ్రే అన్నీ తానై పెంచాడు. అయితే ఊళ్లో జరిగే పెళ్లి వేడుకలకు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే అశోక్‌.. తన అన్నయ్య పెళ్లి తర్వాత తనకు కూడా పెళ్లి చేయాలని తండ్రిని కోరాడు. కానీ అతడి కోసం ఎంత వెదికినా వధువు మాత్రం దొరకలేదు. దీంతో కొడుకు బాధ పడకూడదనే ఆలోచనతో పెళ్లి కూతురు లేకపోయినా సరే..అంగరంగ వైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరిపించాడు. సంప్రదాయ పద్ధతిలో శేర్వాణీ ధరించి, మెడలో పూలమాలతో గుర్రంపై ఊరేగింపుగా బయల్దేరిన కొడుకును చూసి ఆనంద భాష్పాలు పెట్టుకున్నాడు.
ఈ విషయం గురించి అశోక్‌ తండ్రి విష్ణు బరోట్‌ మాట్లాడుతూ..‘ నా కొడుకు అందరిలాగా చురుకైన వాడు కాదు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం మరో దెబ్బ. బంధువులతో పాటు ఊళ్లో వాళ్ల పెళ్లికి కూడా వెళ్లడం తనకు అలవాటు. అలా వెళ్లొచ్చిన ప్రతీసారి తనకూ పెళ్లి చేయమని అడిగేవాడు.

కానీ తనకు వధువు దొరకలేదు. ఈ విషయం గురించి నా కుటుంబ సభ్యులతో చర్చించి నా కొడుకు కలను తీర్చాలని భావించాను. అందుకే పెళ్లి కార్డులు ముద్రించి బంధువులకు పంచాను. ఆ తర్వాత తనను గుర్రంపై ఊరేగించి, బరాత్‌ నిర్వహించాను. ఇవన్నీ చూసి అశోక్‌ ఎంతగానో సంతోషించాడు. సుమారు 800 మంది బంధువులు హాజరై తనను ఆశీర్వదించారు. ఈ విషయం గురించి సమాజం ఏమనుకున్నా నేను పట్టించుకోను. నా కొడుకు సంతోషం కంటే నాకేదీ ఎక్కువ కాదు’ అంటూ తండ్రి ప్రేమ చాటుకున్నారు.