సెప్టెంబర్ 4న గుజరాత్ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, ఇంకో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. వారున్నది మెర్సిడెజ్ బెంజ్ GLC 220D. రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కారు. ప్రయాణీకుల పూర్తి సేఫ్టీ కోసం ఏడు ఏర్ బ్యాగ్స్ (airbags) ఉన్నాయి. అవి ఆయన ప్రాణాన్నికాపాడలేదు.
ఆయన 80 వేల కోట్ల రూపాయల ఆస్తి ఆయన ప్రాణాన్ని కాపాడలేదు:
అందరి ప్రయాణం ఏదో ఒక సమయంలో ముగుస్తుంది. జీవితాన్ని ఉన్నదానితో ఆనందంగా గడప౦డి. జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. మీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాణ్ణి చూసి ఏడవకండి. ఇంకా ఇంకా సంపాదించాలి, కులపోళ్ళల్లో మేమే నెంబర్ 1, చుట్టుప్రక్కల గ్రామాల్లో మేమే అందరికంటే గొప్పగా ఉండాలి అనే తపనను మానండి. మీకంటే తక్కువ స్థాయిలో, మీకంటే కష్టాల్లో ఉన్నవాడిని చూసి జీవించండి. సంతృప్తిగా ఉండే జీవితంలో ఉన్న ఆనందం ఎన్ని వేల కోట్లిచ్చినా మార్కెట్లో దొరకదు, ఎవరూ అమ్మరు, అమ్మలేరు.
గ్రీకు వీరుడు అలెగ్జాండర్ విశ్వవిజేతగా ప్రపంచాన్ని గెలిచిన యోధుడని, అతి పరాక్రమ వంతుడని చరిత్ర చెబుతోంది. 20 ఏళ్లకే సింహాసనం ఎక్కాడు. ప్రపంచాన్నంతా జయించి, చివరలో విషజ్వరం వచ్చి 33 ఏళ్లకే చనిపోయాడు. వైద్యులు రేయింబవళ్ళూ కష్టపడ్డా ప్రాణాలను నిలుపలేకపోయారు. ఇంతటి యోధుడు చనిపోయే ముందు తన వారిని దగ్గరకు పిలిచి మూడు కోరికలు కోరాడు. మొదటి కోరికగా తన శవపేటికను తన వైద్యులు మోయాలని కోరాడు. రెండవ కోరికగా తన శవపేటిక వెంబడి మణులు, మాణిక్యాలు వెదజల్లించండని కోరాడు. మూడవ కోరికగా తాను చనిపోయిన తరువాత తన రెండు చేతులను శవపేటిక నుంచి బయటకు పెట్టి ఊరేగిస్తూ శ్మశానికి తీసుకెళ్లి, అక్కడ కూడా తన రెండు చేతులు బయట పెట్టి ఖననం చేయండని కోరాడు.
ఆ కోరికలకు అర్ధం ఏమిటని అలెగ్జాండర్‌ను ప్రాణస్నేహితుడైన ఓ సైనికాధికారి అడిగాడు. అప్పుడా గ్రీకు చక్రవర్తి ఇలా చెప్పాడు. “నా ప్రజలంతా ఈ పచ్చి నిజాలను తెలుసుకోవాలి. వైద్యులు ఎంత మంది వెంట ఉన్నా మరణాన్ని ఆపలేరు. మనచుట్టూ ఎన్ని ధనరాశులు ఉన్నా ప్రాణం పోయే సమయంలో అవి మనల్ని కాపాడలేవు. రెండు చేతులు ఎందుకు బయట పెట్టమన్నానంటే, నేను ఎన్నో రాజ్యాలను కొల్లగొట్టాను, వేలకొద్దీ ఏనుగులు మోసేట౦త వజ్ర వైడుర్యాలు, బంగారం స౦పాది౦చాను. అయినా ఏవీ నేను నాతో తీసుకపోవడం లేదు అని చెప్పడానికే నా రెండు చేతులు బయట పెట్టమంటున్నాను. జీవితమంతా పోరాడి కూడబెట్టిన ధనరాశులను పోయేటప్పుడు పట్టుకుపోలేం పుట్టినప్పుడు వట్టి చేతులే, ప్రాణం పోయినప్పుడు కూడా వట్టి చేతులతోనే వెళ్తాం అని నా చావు ద్వారా ప్రజల౦దరికీ చెప్పాలనుకున్నాను,” అని చెప్పాడు అలెగ్జాండర్