ముంబయిలో ఓ 14 నెలల బాలుడు ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు నుంచి కింద పడిపోయి.. మృత్యుంజయుడిగా నిలిచాడు. గోవండిలోని ఓ అపార్టుమెంట్‌లో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. తమ ఫ్లాట్‌లో బాల్కనీకి గ్రిల్స్‌ అమర్చి లేకపోవడంతో అక్కడి నుంచి జారి పడ్డాడని తల్లిదండ్రులు తెలిపారు.

సరిగ్గా బాల్కనీ కింద చెట్టు ఉండడంతో దానిపై పడి , బాలుడు నేలను తాకాడు. ఇంట్లో నుంచి బాల్కనీలోకి వెళ్లే తలుపు తెరిచి ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. తమ కళ్ల ముందే ఆడుకుంటున్న బాలుడు ఉన్నట్టుండి కనిపించకపోయే సరికి బాల్కనీ నుంచి కిందికి చూడగా చెట్టుపైనుంచి చిన్నారి కిందికి పడిపోతున్న దృశ్యం కనిపించిందని చెప్పారు. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు హుటాహుటిన కిందికి వెళ్లి చూడగా, బాలుడు సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేగంగా కిందికి పడుతున్న బాలుడు చెట్టు కొమ్మలపై పడి కిందికి చేరడంతో ప్రాణాలతో బయట పడ్డాడని పోలీసులు తెలిపారు.

చెట్ల కొమ్మలు గీరుకొని చిన్నపాటి గాయాలు కావడంతో బాలుడ్ని ఆస్పత్రిలో చేర్పించారు.