మాధవి అగ్నిహోత్రి ! మహిళా ఎస్సై !! మనం సినిమాల్లో చూసే డేరింగ్ పోలీస్ ఆఫీసర్, కరడుగట్టిన నేరస్తుడిని పట్టుకునేందుకు తానే అతడిని పెళ్లిచేసుకుంటానని నాటకం నడిపి పట్టేసింది.

Advertisement

మధ్యప్రదేశ్‌లోని చత్తార్‌పూర్ జిల్లాలోని నౌగోన్‌ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ చౌబే ఓ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. గత కొంత కాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు అతడిని పట్టుకోలేకపోయారు. నిందితుడు బాలకృష్ణ పెళ్లి చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు.

ఇదే అదనుగా నౌగోన్‌ ప్రాంత సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాధవి అగ్నిహోత్రి కాస్త విభిన్నంగా ఆలోచించి బాలకృష్ణను పట్టుకొనేందుకు ఉపాయం వేశారు. మాధవి గతంలో పెళ్లి కూతురిలా అలంకరించుకొని దిగిన పాత ఫొటోను మరో వ్యక్తి ద్వారా నిందితుడు బాలకృష్ణకు చేరేలా ఏర్పాట్లు చేశారు. అది చూసిన నిందితుడు అమ్మాయి నచ్చిందని, తనను కలిసి మాట్లాడేందుకు వస్తానని సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాధవి అగ్నిహోత్రి తన సిబ్బందితో కలిసి కాపుకాసి బాలకృష్ణను పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న బాలకృష్ణపై పోలీసులు రూ.10 వేల రివార్డు కూడా ఉంది…