తనను ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 9న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా దాస్యం వినయ్‌ భాస్కర్‌, విప్‌లుగా గొంగిడి సునీత, గంపా గోవర్ధన్‌, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగా కాంతారావు, బాల్క సుమన్‌లను ముఖ్యమంత్రి నియమించారు.

Advertisement

ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. ‘నాడు ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును విజయవంతం చేశా. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో పనిచేస్తా. నాపై నమ్మకంతో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ధన్యవాదాలు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడతాం. అన్ని పక్షాలను కలుపుకొని సమావేశాలు సజావుగా జరిగేందుకు కృషి చేస్తానని’ పేర్కొన్నారు.