దుబాయ్‌లో ఉద్యోగాలంటూ మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ ఏజెంట్‌ను మంగళవారం రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పరారీలో ఉన్న యెల్లమల్లి శ్రీనుబాబు, మరో ఇద్దరు సహచరుల (పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను, సత్యవతి)తో కలిసి దుబాయ్‌లో ఉద్యోగాలిస్తామని చెప్పి నమ్మించి ఒక్కొక్కరి దగ్గర కనీసం రూ.లక్ష వసూలు చేస్తూ టూరిస్టు వీసాలతో అమాయకులను దుబాయ్ తీసుకెళ్లి అక్కడి ఏజెంట్లకు అమ్మేస్తున్నాడు. 2017లో ఘట్‌కేసర్‌లో దంపతుల నుంచి రూ.4 లక్షలు తీసుకొని అమ్మేశారు. దంపతులు నాలుగు నెలల తర్వాత ఇంటికి చేరుకొన్నారు.

వారి ఫిర్యాదుమేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదుచేసుకొని పోతుల దాసు, త్రిమూర్తులు, తాతాజీ, రామారావు, మురళిని అరెస్టుచేశారు. ప్రధాన నిందితుడు యెల్లమల్లి శ్రీను తన సొంతగ్రామానికి వచ్చిన తరుణంలో రాచకొండ ఎస్వోటీ పోలీసులు గాలం వేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.