రెండేళ్లుగా చవి చూసిన కష్టాలతో ఓ ఐటీ ఉద్యోగి ఉన్మాది మారాడు. తన భార్యను క్రికెట్‌బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల్ని తల దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం చెన్నై పెరుంగుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే: పెరుంగుడిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మణిగండన్‌(42) నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య ప్రియ(36), ధరన్‌(10), దహన్‌(01) అనే కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు ఓ ఐటీ సంస్థలో మణిగండన్‌ ఉద్యోగం చేసేవాడు. లగ్జరీ గానే కుటుంబ జీవనం సాగింది. అయితే, హఠాత్తుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటికే మణిగండన్‌ పరిమితం అయ్యాడు.

కుటుంబ పోషణ కోసం కొన్ని ప్రైవేటు బ్యాంక్‌ల నుంచి, స్నేహితుల నుంచి రూ.లక్షల్లో అప్పు చేశాడు. ప్రస్తుతం అప్పులు భారంగా మారడంతో మణిగండన్‌ ఉన్మాది అయ్యాడు. ఆదివారం భార్య ప్రియను, బిడ్డలను చంపేశాడు. ఆ తర్వాత వంట గదిలో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట జీహెచ్‌కు తరలించారు.