వివాహమైన నెలకే ఉపాధ్యాయురాలు పదో తరగతి విద్యార్థితో పరారైంది. సేలం తిరువాగౌండనూరుకు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రైవేటు ట్యుటోరియల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈమెకు బాగల్‌పట్టికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరితో గత నెల 19న వివాహం జరిగింది. వివాహమైన వారం తర్వాత భర్త చెన్నైలో ఉద్యోగానికి వెళ్లారు. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో కోరిమేడులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లివస్తానని చెప్పి వెళ్లిన యువతి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సూరమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు రోజులుగా గాలిస్తూ వచ్చారు. ఇదిలాఉండగా ఉపాధ్యాయిని 17 ఏళ్ల బాలునితో మంగళవారం పోలీసుస్టేషన్‌కు జంటగా వచ్చింది. వారు కలిసి జీవిస్తామని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. టీచర్‌కు, బాలుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి వారి తల్లిదండ్రుల వెంట పంపారు.