స్కూల్లో ఫంక్షన్‌ ముగియడంతో ఇంటికి బయలుదేరిందా అమ్మాయి. ఇల్లు కొంచెం దూరం కావడంతో ఉబర్ కారు బుక్ చేసుకుంది. కాసేపటికి తన ముందుకొచ్చిన కారు చూసి అదే ఉబర్ కారనుకుంది. దానిలో కూర్చుని పోనీయమంది. కొంతదూరం వెళ్లిన తరువాత కారు దారిమళ్లినట్లు గుర్తించిన ఆమె ఎటు వెళ్తున్నామని డ్రైవర్‌ను ప్రశ్నించింది. దాంతో అతను కారు ఆపేశాడు. కిందకు దిగి వెనక సీట్లో అమ్మాయి పక్కనే కూర్చొన్నాడు. అతనెందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలియని ఆమె కారు దిగిపోయే ప్రయత్నం చేసింది. వెంటనే ఆమెను బలంగా పట్టుకున్న అతను అసభ్యపదజాలంతో ఆమెను దూషించాడు. ఆపై ఆమెను బలాత్కరించాడు. అలా కారులోనే రెండుసార్లు ఆమెపై అత్యాచారం చేసి ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లాడు.

అక్కడ అతని కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మిత్రులు కూడా ఆమెను పంచుకున్నారు. ఒకరి తరువాత ఒకరుగా ఆమెను బలాత్కరించారు. వారిలో ఓ వ్యక్తి ఈ దారుణ కాండను కెమెరాలో బంధించాడు. ఇలా 14 గంటలపాటు నరకం అనుభవించిన ఆమె తన మిత్రులకు భయం భయంగా మెసేజ్‌లు పెట్టింది. అనంతరం ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. మార్గమధ్యంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆమెను చూసి విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆమెను బంధించి ఉంచిన ఇంటి వద్దకు వెళ్లి అక్కడే ఉన్న నిందితులు ముస్తఫా యూసెబసోగ్లు, రూహీ దగ్డనాసర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 2016లో జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు ఇటీవలే రూహీకి 24 ఏళ్లు, వీడియో తీసిన నిందితుడికి 26 ఏళ్లు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడైన ముస్తఫా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు….