వరుస ఎన్నికల సందడి అనంతరం పెళ్లిళ్ల సందడి మొదలైంది . భాజా భజంత్రీలు , సన్నాయి మేళాలు మోగేందుకు శుభ ఘడియలు ఆరంభమయ్యాయి . ఇక పెళ్లి భాజాల సందడిలో దంపతులు ఒకటయ్యే తరుణం వచ్చింది . కొత్త జీవితంపై కోటి ఆశలతో పెళ్లి పల్లకీ ఎక్కేందుకు వధూవరులు ఎదురు చూస్తున్న శుభ గడియలు రానే వచ్చాయి . ఇప్పటికే పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నవారు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు . మాఘమాసం వస్తూనే అనేక శుభముహూర్తాలను తీసుకువచ్చింది..

ఖర్చుకు వెనుకాడటం లేదు:

పెళ్లంటే నూరేళ్ల పంట . . అన్నారు పెళ్లి వేడుక అంటే . . జీవితాంతం గుర్తుండేలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు . జీవితంలో అత్యంత కీలకమైన ఈ ముఖ్య ఘట్టాన్ని ఎంతో రమణీయంగా . . కన్నుల పండువలా . . నిర్వహించుకోవాలని తాపత్రయ పడుతున్నారు . వివాహాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఖర్చుకు వెనుకాడటం లేదు . అయితే ఈ పోటీతత్వం సాధారణ కుటుంబాలకు భారంగా మారింది . కళ్యాణ మండపాల అద్దె వేల నుంచి లక్షల రూపాయల్లో పలుకుతోంది . ఏసీ , నాన్ ఏసీ . . అంటూ ధరలను నిర్ణయిస్తున్నారు . కళ్యాణమండపం ఒక ఎత్తైతే . . దాని అలంకరణ ఖర్చు మరో ఎత్తు . అలంకరణకు కూడా లక్షలు ఖర్చు చేస్తున్నారు . ఇక బ్యాండ్ మేళం , క్యాటరింగ్ ఖర్చులు ఉండనే ఉన్నాయి . మాఘమాసం . . శుభ కార్యాలకు నెలవు : హరికిషన్ శర్మ , వేద బ్రాహ్మణ పండితుడు

శుభకార్యాలకు నెలవు మాఘమాసం :

ఈ మాసం నుంచే వివాహాది శుభ కార్యాలు ఆరంభమవుతాయి . మాఘమాసంలో వివాహం చేసుకుంటే అఖండ సౌభాగ్యం , సుసంతానం కలుగుతుందని ప్రతీతి . ప్రస్తుతం ఫిబ్రవరి ఈనెల 6 , 10 , 14 , 15 , 17 , 20 , 21 , 22 , 23 24 , 28వ తేదీలు , మార్చి నెలలో సైతం ఆయా తేదీల్లో 31 వరకు సుముహుర్తాలు ఉన్నాయి . వివాహాలు గృహ ప్రవేశాలు , నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాలకు చాలా మంచి ముహూర్తాలు . మాఘమాసం నుంచి జ్యేష్టమాసం వరకు ప్రతి మాసంలో ఆయా తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి . ఉత్తరాయణ పుణ్యకాలం తరువాత మొదటగా వచ్చే శుభప్రద మాసం ఇదే . అందుకే ఉత్తరాయణంలో ప్రారంభమయ్యే శుభ ముహూర్తాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది .