ఆడుకుంటూ వెళ్లి ఇద్దరు అన్నదమ్ముళ్లు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తిరుమలాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిత్తనూరి శ్రీను-హైమ దంపతులకు చిత్తనూరి సూర్యా(10), చిత్తనూరి విశాల్‌(7) ఇద్దరు కుమారులు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సూర్యా మూడో తరగతి, విశాల్‌ రెండో తరగతి చదువుతున్నారు. అన్నాతమ్ముళ్లిద్దరూ ఆడుకునేందుకు ఉదయమే ఇంటి నుంచి బయటకు వెళ్లారు. పాఠశాలకు సమీపంలోనే మర్రికుంట ఉంది. అన్నతమ్ముళ్లిద్దరూ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటికుంటలో పడ్డారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. సాయంత్రం వీరి మృతదేహాలు తేలడంతో గ్రామస్థులు కుంట వద్దకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మరణంలోనూ వీడని బందంగా ఇద్దరు మృతి చెందారు. ఉన్న ఇద్దరు కుమారులు ఒకేసారి మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు మృత దేహాలపై పడి రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. కొడుకులిద్దరూ మృతి చెందడంతో తామెవరికోసం బ్రతకాలంటూ బోరున విలపించారు. వీరిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చారు. ఇద్దరు అన్నాతమ్ముళ్ల మృతితో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.