మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిల‌ర్ బానోత్ ర‌వినాయ‌క్ గురువారం ఉద‌యం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ప‌ట్ట‌ణంలోని ప‌త్తిపాక వ‌ద్ద దుండ‌గులు గొడ్డ‌ళ్ల‌తో అతి కిరాత‌కంగా న‌రికిచంపారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజ‌న కౌన్సిల‌ర్‌ను సిటీ న‌డిబొడ్డున హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ర‌వినాయ‌క్ ప్రాణాలు కోల్పోయిన‌ట్లుగా వైద్యులు నిర్ధారించారు. ర‌వినాయ‌క్ మృత‌దేహాన్ని ప్ర‌స్తుతం పోస్టుమార్టంకు త‌ర‌లించారు.

ర‌వినాయ‌క్ హ‌త్య వ‌రంగ‌ల్ జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది. కొద్దిరోజులుగా కొంత‌మంది నేత‌ల‌తో బానోతు ర‌వినాయ‌క్ తీవ్రంగా విభేదిస్తూ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని కూడా స్వ‌యంగా కొంత‌మంది త‌న స‌న్నిహితుల‌తో ర‌వినాయ‌క్ పేర్కొన్న‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే ర‌వినాయ‌క్ హ‌త్య‌కు గురికావ‌డం గ‌మ‌నార్హం. ర‌వినాయ‌క్‌కు భార్య పూజ, ముగ్గురు పిల్ల‌లున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.